ఎప్పుడూ వివాదాల్లో ఉండే భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, సహ్రాన్‌పూర్ జిల్లాలోని దియోబంద్ పట్టణం ఉగ్రవాదులకు పుణ్యక్షేత్రమని వ్యంగ్యంగా మాట్లాడారు. కాగా, మంత్రి వ్యాఖ్యలు ఎలాంటి ఉపద్రవం తీసుకొస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం దియోబంద్ పట్టణంలో నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన గిరిరాజ్‌సింగ్.. ఆ పట్టణం ఉగ్రవాదులకు గంగోత్రి లాంటిదని వ్యంగ్యాస్త్రం సంధించారు. ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ లాంటి ప్రపంచ పేరు మోసిన టెర్రిరిస్టులెందరో దియోబంద్‌లో పుట్టిపెరిగారన్న మంత్రి.. ఇక్కడ జనాభా నియంత్రణ చట్టాన్ని అమలుచేయకపోతే దేశం అభివృద్ధి చెందదని వ్యాఖ్యానించారు.
గిరిరాజ్ దియోబంద్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018 నవంబర్‌లో కూడా దియోబంద్ పేరును ‘దియోవ్రంట్’ అని సంబోధించారు. ఐసిస్ చీఫ్ బాగ్దాదీ, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లాంటి వారిని దియోబంద్ పట్టణం ఉత్పత్తి చేస్తున్నదని గిరిరాజ్ వ్యాఖ్యానించారు. కాగా, నాయకులు ప్రజల మధ్య శాంతిని కోరుకోవాలి గానీ, ఇలాంటి చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.