హైదరాబాద్‌లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ సాయంత్రం కేంద్రం బృందం రాష్ట్రానికి రానుంది. సిటీతో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండ్రోజులు పర్యటించి.. నష్టం తీవ్రతను తెలుసుకోనున్నారు. ఈ నెల 13 నుంచి కురుస్తున్నఎడతెరిపిలేని వర్షాలతో హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు రాష్ర్ట ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయంగా 1350 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. తెలంగాణలో నెలకొన్న వరద పరస్థితులను, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న కేంద్రం బృందం.. రెండ్రోజులు నగరంతో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మూసీ నదిలో ఆక్రమణలపై ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆక్రమణలు తొలగించాలని కోరారు.