కోహ్లీసేన ఆల్ రౌండ్ షోతో ఐపీఎల్ లో అదరగొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 84 పరుగులకే కట్టడి చేసిన బెంగళూరు జట్టు.. ఆ తర్వాత ఈజీ టార్గెట్‌ను రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 39 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. సిరాజ్ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది. సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆదుకున్నాడు. ఒక్కడే కాసేపు నిలకడగా ఆడగలిగాడు. మోర్గాన్ 30 పరుగులతో రాణించకపోతే.. కోల్‌కతా స్కోరు 50 కూడా దాటేది కాదేమో. బెంగళూరు బౌలర్లు నాలుగు ఓవర్లు మెయిడిన్ చేశారంటే.. ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. పడిక్కల్, ఆరోన్ ఫించ్ తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే ఫెర్గూసన్ వేసిన 7వ ఓవర్‌లో వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన గుర్‌కీరత్ సింగ్ , విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత గేర్ మార్చి బౌండరీలు బాదడంతో 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌కు చేరువైంది.