ప్రపంచానికి రాజకీయ పాఠాలు చెబుతానని చెప్పే.. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ.. టీడీపీ అధినేత చంద్రబాబు.. అనూహ్యమైన రీతిలో ప్రతిపక్షానికి పరిమితమై.. ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశారు ? ఏం సాధించారు ? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన పరాజయం పాలైన చంద్రబాబు.. కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే దక్కించుకున్నారు. వారిలోనూ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంకొంత మంది గోడదూకే ప్రక్రియలో ప్రయోగాలు చేస్తున్నారు.
ఇక ఈ ఏడాది కాలంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అనేక ఉద్యమాలు చేపట్టారనడంలో సందేహం లేదు. ఇసుక కొరతపైనా, ఇసుకను ఆపేయడంపైనా ఆయన విజయవాడలో నిరాహార దీక్ష చేశారు. అన్నక్యాంటీన్లను నిలిపివేయడంపైనా ఉద్యమాలు నిర్వహించారు. గుంటూరులో తన పార్టీకి చెందిన దళిత నేతలపై కేసులు పెట్టి.. ఊరును కూడా ఖాళీ చేయించారని ఆరోపిస్తూ.. భారీ ఎత్తున వివాదానికి తెర దీశారు. కేంద్ర స్థాయిలో మానవహక్కుల కమిషన్‌ను కూడా రప్పించారు.
ఇక రాజధాని విషయంలో మూడు రాజధానులు వద్దని పేర్కొంటూ.. అమరావతిలో దాదాపు రెండు నెలలపాటు స్వయంగా చంద్రబాబు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. అమరావతి కోసం అంటూ.. ఆయన జోలె కూడా పట్టిన విషయం తెలిసిందే. ఇలా.. అనేక సందర్భాల్లో ప్రభుత్వంపై విమర్శలు, ఆందోళనలు చేసిన చంద్రబాబు.. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం, జగన్‌పై నిందలు వేసుకోడానికి మాత్రమే పరిమితమయ్యారనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
ప్రతిపక్ష నేతగా ఆయన నిర్మాణాత్మక శైలిని అనుసరించకుండా.. రాజకీయ కోణాన్ని పట్టుకుని ముందుకు సాగడం.. అదే సమయంలో రా ష్ట్రంలో ఏం జరిగినా కూడా ప్రజలకు, రాజ్యాంగానికి ముడిపెట్టి మరీ.. చంద్రబాబు విమర్శించడం కూడా ప్రజలను ఆకట్టకోలేక పోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఉన్న విధంగానే చంద్రబాబు వ్యవహరించారనే వాదన ఇప్పటికీ వినిపిస్తుండడం గమనార్హం.