ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ.. గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా ఉంటుంది నాయకుల తీరు. ఇది ఎక్కడైనా ఉండేదే. విజయనగరం టీడీపీ రాజకీయాలు కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా జిల్లా టీడీపీ రాజకీయాలను కనుసైగతో శాసించిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుకు ఇంటా బయటా అన్నీ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ పునాదులను ప్రభుత్వం కదిలిస్తే.. టీడీపీలో ఆయన్ని ధిక్కరించే నాయకుల సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్లుగా టీడీపీలో వాడీ వేడీ చర్చకు దారితీస్తోన్న ఈ సమస్య ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు చేరింది. దాంతో పార్టీ అధినేత ఎలాంటి పరిష్కారం సూచిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు విజయనగరం రాజావారి కోటనే జిల్లాలో టీడీపీ ఆఫీస్‌గా కొనసాగుతోంది. తెలుగుదేశం మంత్రాంగం అంతా అక్కడ నుంచే నడుస్తుంది. కానీ.. అశోక్ గజపతిరాజు పొడగిట్టని కొంతమంది టీడీపీ నేతలకు మాత్రం కోట గుమ్మం తొక్కాలంటే ఏదోలా ఫీలవుతున్నారు. దీంతో పార్టీలో వేరు కుంపటి రాజేస్తున్నారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆ తర్వాత మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత.. వేర్వరుగా టీడీపీ ఆఫీసులు తెరిచి అశోక్ నాయకత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గీతను కాదని మొన్నటి ఎన్నికల్లో కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు అశోక్. అప్పటి నుంచి అశోక్, గీతల మధ్య దూరం వచ్చింది. రాజావారిపై ప్రతికారం తీర్చుకుందామని ఎదురు చూస్తున్న ఆమె.. పార్టీ ఆఫీసు తెరిచి సంచలనం రేపారు.
టీడీపీలో అశోక్ గజపతిరాజు సీనియర్ నాయకుడు. మీసాల గీత మాజీ ఎమ్మెల్యేనే కాదు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజికవర్గానికి చెందిన మహిళా నేత. అందుకే కొత్తలో ఈ సమస్య జోలికి వెళ్లలేదు పార్టీ పెద్దలు. అధికారంలో లేనందున క్రమంగా అవే సర్దుకుంటాయని భావించారట. కానీ.. అంతా రోడ్డున పడుతున్నారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న చంద్రబాబు.. స్వయంగా కల్పించుకున్నారు. మరి అశోక్‌ను.. ఆయన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతల మధ్య సయోధ్య కుదుర్చుతారా? లేక ప్రస్తుత రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.
టీడీపీలో అశోక్ పాత తరం నేత. గీత, అప్పలనాయుడులు కొత్త తరం. ఇప్పటికే అశోక్ అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. రానున్న కాలంలో ఆయన పార్టీకి ఎంత వరకు ఉపయోగపడతారు అన్న చర్చ టీడీపీలో జరుగుతోందట. ఒకవేళ అశోకే కావాలి అని అనుకుంటే.. కొత్తతరం నాయకులను వదులుకోవాలి. అసలే టీడీపీ నేతలపై వల వేసి కూర్చుంది వైసీపీ. ఇలాంటి తరుణంలో ఉన్ననేతలను వదులుకుంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. కేడర్ జారిపోతుంది. పార్టీకి కొత్తతరమే కావాలని అభిప్రాయపడితే మాత్రం.. అశోక్‌ను సైలెంట్‌గా ఉండమని చెప్పే వీలుందట.
ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా నెమ్మదించమని చెబుతారని సమాచారం. టీడీపీ ఇదే ప్రతిపాదన చేస్తే దానికి అశోక్ గజపతిరాజు ఒప్పుకొంటారా ఆయన స్పందన ఎలా ఉంటుంది అన్నదీ ప్రశ్నే. అందుకే చంద్రబాబు చాణక్యం ఎలా ఉంటుందో చూడాలి.