చంద్రబాబు డైరెక్షన్… పవన్ యాక్షన్‌తో విశాఖలో లాంగ్ మార్చ్ జరగిందా ? అంటే సాక్షాత్తు టీడీపీ నాయకులే అవునని ఒప్పుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఎన్నోసార్లు పవన్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఎన్నికలకు ముందు తప్పకపోవడంతో లోకేష్‌పై తూతూ మంత్రంగా విమర్శలు చేసి సరిపెట్టారు. ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి అప్రతిహత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన ఎంత ఘోరంగా ఓడిపోయాయో తెలిసిందే. ఇక ఇప్పడు ఐదు నెలలు కాకుండా మళ్లీ ఈ రెండు పార్టీలు కలిసిపోయి వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇటు చంద్రబాబు పవన్ స్నేహం కోసం అర్రులు చాస్తుండడం టీడీపీ నేతలకే నచ్చడం లేదు. బాబు పవన్‌తో మాత్రమే కాదు అటు ఎన్డీయేకు కూడా దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు పవన్… చంద్రబాబు లక్ష్యంగా అప్పుడు నానా విమర్శలు చేసారు. ఐదు నెలలకే ఇప్పుడు తాను గైడెన్స్ ఇస్తూ పవన్‌తో డ్రామాలు ఆడిస్తున్నారని టీడీపీ నేతలు బాబు తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. అసటు పవన్‌కే ఓ వైపు రాజకీయంగా క్లారిటీ లేదని… అలాంటిది ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. పవనే గొప్ప నటుడు అనుకుంటే… అలాంటి పవన్‌ను డైరెక్ట్ చేస్తోన్న బాబు గొప్ప దర్శకుడు అయ్యాడని కూడా టీడీపీ వాళ్లే విమర్శలు చేస్తోన్న పరిస్థితి.
విశాఖ సభలో 55 నిమిషాల పాటు మాట్లాడిన పవన్ టీడీపీతో పాటు ఆ పార్టీ నేతలను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఇక బాబు కూడా పవన్ కార్యక్రమానికి సపోర్ట్ చేయడంతో పాటు అటు మాజీ మంత్రులను పంపడం… వారు కూడా పవన్‌కు తమ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పడాన్ని బట్టి చూస్తే బాబు మళ్లీ పవన్ కోసం అర్రులు చాస్తున్నట్టే కనపడుతోంది. ఈ క్రమంలోనే బాబు మళ్లీ యూటర్న్ తీసుకుని పవన్ ప్రాపకం కోసం పాకులాడడం ఆ పార్టీ నేతలకే వెగటు పుట్టిస్తోంది.