ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది. మార్చి 15వ తేదీలోపు ఈ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు జన చైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను ప్రజలకు తెలిసేలా చేయాలి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
45 రోజుల పాటు జనచైతన్య యాత్రలు చేయాలని ఈ నెల 17 నుంచి ఆ యాత్ర మొదలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. జన చైతన్య ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ యాత్ర చెయ్యాలని నిర్ణయించారు, అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కూడా కాకముందే ప్రతిపక్ష నేత ఇటువంటి యాత్ర చెయ్యడం సబబు కాదని భావించారు.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ ఈ జన చైతన్య యాత్రను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో జరపాలని నిర్ణయించారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం 45 రోజుల పాటు పోరాటం చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటవరకూ పలు రకాల నిరసనలు చేపట్టామని, మళ్ళీ ఇప్పుడు 45 రోజుల పాటు యాత్ర చెయ్యాలి అంటే ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో గొడవలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ సమయంలో మళ్లీ జనచైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళితే మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతి చోట టీడీపీ వర్గీయులపై పలు రకాల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గ్రామ గ్రామాల్లోనూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 45 రోజుల పాటు చేయడం సాధ్యం కాదని తెలుగుదేశం నేతలు చెబుతున్నట్టు తెలిసింది.