తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు క్లోజ్ అయిపోయినట్లే అని చెప్పొచ్చు. పేరుకు పార్టీ ఉన్నా సరే తెలంగాణ రాజకీయాల్లో టీడీపీకి పెద్ద స్కోప్ లేదు. అసలు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా గెలిచే బలం లేకుండా పోయిందని చెప్పొచ్చు. అలా అని తెలంగాణలో టీడీపీకి క్యాడర్ లేదా? అంటే కొంతవరకు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే దశాబ్దాల పాటు తెలంగాణలో రాజకీయం చేసి, ఇక్కడ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్న టీడీపీని అభిమానించే వారు కొంతమంది ఉన్నారు.
రాష్ట్రంలో టీడీపీ అంటే ఇష్టపడే వారు ఉన్నారు. కానీ పార్టీ పరిస్తితి బాగోకపోవడం, అప్పటికప్పుడు ఉన్న పరిస్తుతులని బట్టి టీడీపీ క్యాడర్ వేరే పార్టీలకు మద్ధతు ఇస్తూ వస్తుంది. అయితే ఆ టీడీపీ క్యాడర్‌ని తనవైపుకు తిప్పుకునేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీకి, రేవంత్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు. అలాగే చంద్రబాబు అంటే రేవంత్‌కు ఎంత గౌరవమో కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకే రేవంత్, పిసిసి అధ్యక్షుడు అయ్యాక తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆ చంద్రబాబు పేరు చెప్పే రేవంత్‌ని దెబ్బకొట్టాలని ప్రత్యర్ధులు చూస్తున్నారు. కానీ అదే చంద్రబాబు పేరుని తనకు ప్లస్‌గా మార్చుకోవాలని రేవంత్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలు చంద్రబాబు వల్లే టీఆర్ఎస్ ఉందని, అందులో సగం పైనే నాయకులు టీడీపీ నుంచి వెళ్ళిన వారే అని, కేసీఆర్ సైతం టీడీపీ నాయకుడే అని రేవంత్ మాట్లాడిన విషయం తెలిసిందే.
అలాగే 2009 ఎన్నికల్లో చంద్రబాబు కాళ్ళు పట్టుకుని మరీ కేసీఆర్…కేటీఆర్‌ని గెలిపించుకున్నారని రేవంత్ మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రబాబు కూడా యూత్ కాంగ్రెస్ నాయకుడుగా పనిచేశారని, కాంగ్రెస్‌లోనే ఎదిగారని, అలాగే ఇప్పుడు యువ నేతలు కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని రేవంత్ చెబుతున్నారు. అంటే ఇలా రేవంత్, చంద్రబాబుని పరోక్షంగా పొగుడుతూ…టీడీపీ క్యాడర్‌ని మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుని, కాంగ్రెస్‌కు ప్లస్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.