ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు.శుక్రవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు.
పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులోభాగంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ కూడా దర్శించేవారు.అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చారు. ఆ తర్వాత సదరు ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వరకు వచ్చింది… నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పే వారే వైఎస్ జగన్ ప్రభుత్వంలో కరువయ్యారు.