అరణ్యాల్లో ఉండే వన్య మృగాలు అప్పుడప్పుడు జనాలు తిరిగే ప్రదేశాల్లో సంచరించడం మామూలే. ఇది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మాత్రం ఓ చిరుతపులి ఏకంగా ఓ రెస్టారెంట్‌కే వచ్చింది. అక్కడ కొంత సేపు ఉండి అటు నుంచి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో పులిని చూసిన వారందరూ కొంతసేపు ఊపిరి బిగపట్టుకున్నారు. ఏం జరుగుతుందోనని భయపడ్డారు. అయితే ఆ పులి మాత్రం తాపీగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అందరూ హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకున్నారు.
సౌతాఫ్రికాలోని పుమాలంగ అనే ప్రాంతంలో ఉన్న సింగిత ఎబొని లాడ్జ్‌లోని రెస్టారెంట్‌లో పైన తెలిపిన ఘటన చోటు చేసుకుంది. పక్కనే అటవీ ప్రాంతం ఉండడంతో ఓ చిరుతపులి ఆ రెస్టారెంట్‌కు వచ్చింది. అక్కడ కొద్ది సేపే ఉండి.. వెంటనే రెస్టారెంట్ నుంచి బయటకు ఉన్న ఓ మెట్ల మార్గం ద్వారా ఆ పులి బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో దాన్ని వీడియో తీశారు. అనంతరం దాన్ని ఆ లాడ్జ్ వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఆ పులికి చెందిన వీడియోను ఇప్పటికే 2.8 లక్షల మందికి పైగా వీక్షించారు. అయితే ఆ రెస్టారెంట్‌కు వన్య మృగాలు రావడం సహజమేనని, అయితే వాటికి భయపడకుండా ఉండేందుకు తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, దీంతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదని తెలిపారు. తాము తమ గెస్ట్‌ల రక్షణకు ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.