2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నానా హంగామా చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ని, పశ్చింబెంగాళ్ సీఎం దీదీ మమతా బెనర్జీని కలిశారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా శరత్ పవార్ లాంటి నేతల్ని కలిసి హడావిడి చేశారు. జాతీయ స్థాయిలో సమకాలీన రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం వుందని, అది గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాలని పెద్ద లెక్చరే ఇచ్చారు.
ఆ తరువాత అంతా గప్ చుప్. మోడీ కారణంగా ఈ ఫ్రంట్ ముందుకు సాగలేదు. ఆ తరువాత ఎలాంటి కదలిక లేదు. మళ్లీ దీనిపై కదలిక మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో ఈ పార్టీ వుంటుదన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ఇదే నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న బీజేపీ కూడా బలంగానే వినిపిస్తోంది. అయితే ఈ నినాదాన్ని బీజేపీ నుంచి హైజాక్ చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట.
రానున్న ఎన్నకలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటి నుంచే జాతీయ రాజకీయాల్లో అలజడి సృష్టించాలని, తద్వారా తను ఏర్పాటు చేయాలనుకుంటున్న జాతీయ పార్టీని మరింతగా వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పటికే పార్టీ పేరుని `నయా భారత్`గా నామకరణం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన పార్టీ చిహ్నం, రిజిస్ట్రేషన్‌ల బాధ్యతల్ని కేసీఆర్ తన పార్టీ కీలక నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తనతో కలిసి వచ్చే విధ రాష్ట్రాల కీలక నేతలతో కేసీఆర్ కీలక మంతనాలని రహస్యంగా జరుపుతున్నట్టు వినిపిస్తోంది. బీజేపీ కూడా ఓ కంట కన్నేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ప్రయత్నాలని ముమ్మరం చేసింది. ఇందు కోసం గుజరాత్‌కు చెందిన ఓ ఎంపీకి ఆ బాధ్యతల్ని అప్పగించిందట. ఈ తాజా రేసులో కేసీఆర్ పంతం నెగ్గుతుందో లేక మళ్లీ మోడీనే పంతం నెగ్గించుకుంటారో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.