కంచుకోటలో అడ్రెస్ లేని టీడీపీ…మైనస్ అవుతున్న వైసీపీ…!

-

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఎక్కువసార్లు విజయం సాధించిన నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అలాంటి కంచుకోటలు 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు బద్దలయ్యాయి. అలా బద్దలైన కంచుకోటల్లో విజయనగరం జిల్లా శృంగవరపుకోట కూడా ఒకటి. ఏ ఎన్నికలైన ఇక్కడ టీడీపీదే పైచేయి. 1983,1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఒక్క 2004లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్ధి కోళ్ళ లలితకుమారిపై విజయం సాధించారు.

అయితే ఎన్నికలైపోయి ఏడాది దాటేసింది. కానీ ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మంచి మార్కులే ఏమి పడటం లేదు. కడుబండి ఎక్కువగా గజపతినగరంలోనే ఎక్కువ ఉంటున్నారని, శృంగవరపుకోట ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా తక్కువ అని టాక్. క‌డుబండి 2014 ఎన్నిక‌ల్లో గ‌జ‌ప‌తిన‌గ‌రం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గ‌జ‌ప‌తిన‌గ‌రం సీటును బొత్స సోద‌రుడు అప్ప‌ల న‌ర‌స‌య్య‌కు ఇచ్చే క్ర‌మంలో ఆయ‌న్ను శృంగ‌వ‌ర‌పుకోట‌కు మార్చారు. ఇక ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచి యేడాదిన్న‌ర కావొస్తున్నా అభివృద్ధి పనుల విషయంలో కూడా చొరవ చూపడం లేదని తెలుస్తోంది. దీంతో కోటలో వైసీపీపై ఎక్కువగానే మైనస్ ఉంది.

ఇక ఈ మైనస్‌ని ఉపయోగించుకుని బలపడాల్సిన టీడీపీ అడ్రెస్ లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదని తెలిసింది. ఏదో మీడియా సమావేశాల్లో తప్పా, బయటకొచ్చి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయడం లేదు. దీంతో కొంత టీడీపీ కేడర్ వైసీపీ వైపుకు వెళ్లిపోయింది. చాలామంది వైసీపీలోకి వెళితే పనులు అవుతాయని చెప్పి, అటు వెళుతున్నారు. అలా అని చెప్పి వైసీపీ ఏమి స్ట్రాంగ్‌గా లేదు. కేవలం అధికారంలో ఉండటమే అడ్వాంటేజ్. ఇలాంటి సమయంలోనే కోళ్ళ లలిత పార్టీలో యాక్టివ్‌ అయితే బెటర్. ఇప్పటి నుంచే దూకుడుగా ఉంటే ఎన్నికల సమయానికి టీడీపీ బాగా పికప్ అవుతుంది. లేదంటే మళ్ళీ కంచుకోటని మళ్ళీ కోల్పోవాల్సిందే అన్న వాతావ‌ర‌ణ‌మే అక్క‌డ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news