అప్పులు తీర్చే దేవాలయం ఇది.. అప్పులు తీర్చే ఆపద్భాందవుడు..

-

ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తులకోసం నెలవై ఉన్నాడు. ఈ దేవాల‌యం ద‌ర్శిస్తే చాలు ఎంత‌టి బాధ‌లనుంచి అయినా విముక్తి పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.

హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనే పోసి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామి వారి అనుగ్రహంతో అప్పులు తీరతాయని భక్తుల నమ్మకం. ఇంకా ప్రతీ శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామి వారి అనుగ్రహం కలుగుతుందట. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయట పడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధ‌లున్నా స‌రే ఆ బాధ‌ల నుంచి విముక్తి పొందుతార‌ని ప్ర‌జ‌ల విశ్వాసం. ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం..

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు వివాహం చేసుకోవ‌డం కోసం కుబేరుని దగ్గ‌ర ధ‌నాన్ని అప్పుగా తీసుకున్నారని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఆ కుబేరుని అప్పుని తీర్చ‌లేక వేంక‌టేశ్వ‌ర స్వామివారు చింతతో, దిగులుతో చిల్పూరు గుట్ట‌కు వ‌చ్చార‌ని, ఆ కొండ‌పైకెక్కి అక్క‌డ గుహ‌లో కుబేరుడి అప్పు తీర్చ‌లేద‌ని బాధ‌ప‌డుతూ త‌ప‌స్సులో ఉండిపోయార‌ని స్థ‌ల‌పురాణం తెలియ‌జేస్తోంది. కుబేరుని అప్పు తీర్చ‌లేక ఇక్కడ‌కు వ‌చ్చి త‌ప‌స్సు చేశారు కాబ‌ట్టి ఈ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు. బుగుల్ (గుబులు) అంటే చింత‌, దిగులు అని అర్ధం.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు ఈ గుట్ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్ప‌డ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్క‌డే ఒక అఖండ దీపం వెలిసింద‌ని స్థలపురాణం మ‌న‌కు తెలియ‌జేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news