పేరుకేమో కమ్యూనిస్టు దేశం.. కానీ జనాలకు తమ గొంతుకను వినిపించే స్వేచ్ఛ అక్కడ ఉండదు.. అక్కడి నియంత పాలకులు చెప్పిందే ప్రజలు పాటించాలి. మీడియా కూడా ప్రభుత్వాలు చెప్పిందే పత్రికల్లో రాయాలి. చానళ్లలో ప్రసారం చేయాలి. అలా కాకుండా నడుచుకుంటే.. జైలు ఊచలు లెక్కబెట్టిస్తారు.. ఇదీ చైనాలో ఉన్న పరిస్థితి.. అందుకనే అక్కడ కరోనా పుట్టిందనే నిజం బయటి ప్రపంచానికి తెలియడం ఇంత ఆలస్యమవుతోంది. అసలు ఆ వివరాలను చైనా ఎప్పుడో నాశనం చేసిందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడి ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా ప్రవేశించిందా..? అక్కడి పౌరులకు ప్రైవసీ అనేది లేకుండా పోయిందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
అభివృద్ధి చెందిన నగరాలే కాదు, చెందుతున్న నగరాలు, పట్టణాల్లోనూ ఇప్పుడు సీసీటీవీ కెమెరాల వాడకం ఎక్కువైంది. బహిరంగ ప్రదేశాల్లో వీలైనన్ని ఎక్కువ సీసీకెమెరాలు అమర్చడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చు. ఒక వేళ నేరాలు జరిగినా నిందితులను క్షణాల్లో పట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు దాదాపుగా అనేక నగరాలు, పట్టణాల్లో వీటి వాడకం ఎక్కువైంది. అయితే ప్రజలకు శాంతి భద్రతలను కల్పించేందుకు సీసీ కెమెరాల వాడకం ఆవశ్యకమే అయినా.. చైనా మాత్రం ఈ కెమెరాల వాడకంలో ఒకింత దుందుడుకు వైఖరినే అవలంబిస్తోంది.
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను హోం క్వారంటైన్‌లో ఉంచేందుకు వారి ఇంటి డోర్ల వద్ద సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఇండ్ల వద్ద ఇలా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి అనుసంధానం చేస్తారు. ఈ క్రమంలో ఇండ్లలో నుంచి పౌరులు బయటకు వెళ్తే.. ఆ కెమెరా ఏఐకి కనెక్ట్ అవుతుంది.. అక్కడి నుంచి ఓ అలర్ట్ మెసేజ్ స్థానికంగా ఉన్న కమ్యూనిటీ వర్కర్లు, పోలీసులకు చేరుతుంది. దీంతో వారు బయటకు వచ్చిన ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని తిరిగి ఇంట్లోకి పంపిస్తారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అసలు తంటా అక్కడే మొదలవుతోంది.
సీసీ కెమెరాలను ఇండ్ల బయట ఏర్పాటు చేయాలనే ఆలోచన కరెక్టే అయినా.. ఈ విషయంలో చైనా కొంత ముందుకు వెళ్లి.. ఏకంగా కొందరి ఇండ్లలో బెడ్‌రూంలు, లివింగ్ రూంలలో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఆ పౌరులు తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు తమ గోడును సోషల్ మీడియాలో వెళ్లబోసుకుంటున్నారు. తమ తమ ఇండ్లలో ఫిక్స్ చేయబడిన సీసీ కెమెరాల ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చైనా అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది.
పౌరుల ఇండ్ల బయట కాకుండా కొందరి ఇండ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై అక్కడి అధికారులు స్పందిస్తూ.. సదరు కెమెరాలు పౌరులు కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే వారిని ఫొటోలు తీసి తమకు పంపిస్తుందని.. వారు ఇండ్లలో ఉంటే కెమెరాలు వారి ఫొటోలు, వీడియోలు తీయవని… అంటున్నారు. అయినా.. ఆయా కెమెరాలు తమ మాటలను, వీడియోలను రికార్డు చేస్తున్నాయేమోనన్న అనుమానం తమకు కలుగుతుందని పౌరులు అంటున్నారు. దీంతో చైనాలో క్వారంటైన్‌లో ఉన్నవారి ప్రైవసీని అక్కడి ప్రభుత్వం హరిస్తుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సీసీ కెమెరాల ఇన్‌స్టాలేషన్ అవసరమే అయినా.. వాటిని వారి ఇండ్ల బయట అమర్చాలని.. లోపల అమర్చాల్సిన అవసరం ఏమిటని.. పౌర హక్కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
అయితే నిజానికి సీసీకెమెరాల ఇన్‌స్టాలేషన్ విషయంలో చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పాలసీని ప్రకటించలేదు. కానీ.. చైనాలోని అనేక నగరాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో సీసీ కెమెరాలను ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో అమర్చారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వానికి చీమ చిటుక్కుమన్నా తెలుసుకోవడం చాలా తేలికైందని పలువురు చెబుతున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సీసీ కెమెరాల నిఘా కలిగిన టాప్ 10 నగరాల్లో 8 నగరాలు చైనాలోనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతోంది.
చైనాలో ఏ అంశాన్ని తీసుకున్నా.. ప్రభుత్వం నిఘా అన్నింటిపై కచ్చితంగా ఉంటుంది. ఇక ఇంటర్నెట్ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే చైనా పౌరులకు చెందిన మొత్తం డేటా అక్కడి ప్రభుత్వం చేతిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతోనే ఆ దేశ ప్రభుత్వం అన్ని రకాల మీడియాను కంట్రోల్ చేస్తుందని, అందుకనే అక్కడ ఏం జరిగినా.. బయటి ప్రపంచానికి అస్సలు తెలియదని.. విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా.. చైనాలో ఉన్న పౌరులను చూస్తే మాత్రం మనకు జాలి కలగక మానదు.. అక్కడి నియంతృత్వ పాలకుల చేతిలో వారు ఇంకా బందీలుగానే ఉన్నారు. వారి బానిసత్వపు సంకెళ్లు ఎప్పుడు తెగుతాయో చూడాలి..!