మాతృభూమిని రక్షించేందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రధాని మోదీ తెలిపారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆ దేశ సైనికాధికారులతో భారత్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ చర్చలు కొనసాగుతుండగానే సరిహద్దు వద్ద చైనా ఆర్మీ జరిపిన దాడిలో 20 మంది భారత జవాన్లు చనిపోయారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇక భారత్ చైనాతో ఉన్న అన్ని సంబంధాలను కట్ చేసే పనిలో పడడంతోపాటు.. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు కావల్సిన యుద్ధ పరికరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం సరిహద్దు ప్రాంతమైన లేహ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
మనం ఇప్పుడు కష్ట సమయంలో పోరాటం చేస్తున్నామని మోదీ అన్నారు. మన పోరాటం ఎంతో విలువైందన్నారు. భారత సేనలకు కావల్సిన అన్ని రకాల సదుపాయాలను, ముఖ్యంగా యుద్ధ పరికరాలను, ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసి అందిస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుల వద్ద సైనికుల కోసం అనేక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. తన ప్రసంగం సందర్బంగా మోదీ భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినదించారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్‌ను నిర్మించి చూపిస్తామని మోదీ తెలిపారు. ఇప్పటి వరకు కుయుక్తులు పన్నే వారి కుట్రలు ఎన్నటికీ ఫలించలేదని, అవి ఫలించవని అన్నారు. చైనాలాంటి దేశాలు ప్రపంచశాంతికి పెను ప్రమాదమని వ్యాఖ్యానించారు. మంచి భవిష్యత్తుకు పునాది అభివృద్ధేనని అన్నారు. భారత్ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నారు. శాంతి కోసం భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రపంచానికి తెలుసన్నారు. ధైర్య సాహసాలు ఉన్నవారే శాంతిని కోరుకుంటారని తెలిపారు.
శత్రువుల కుట్రలను భగ్నం చేస్తున్నామని మోదీ అన్నారు. గతంలో ఎంతో మంది శత్రువులతో పోరాడి విజయం సాధించామని, ఇప్పుడు కూడా విజయం సాధిస్తామని అన్నారు. భారత్‌పై కుట్రలు పన్నే శత్రు దేశాల ఆటలు ఇక సాగవని అన్నారు. భారతీయులు తమ సైనికులను చూసి గర్వపడుతున్నారని అన్నారు. భారత జవాన్ల చేతుల్లో దేశం భద్రంగా ఉందని మోదీ అన్నారు.