ఏపీలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎదుర్కుంటున్నారు. పార్టీ నాయకులకు భరోసా కల్పించే విధంగా బాబు ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం పై రాజీ లేకుండా పోరాటం చేస్తూ, ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగేలా బాబు ప్రయత్నాలు చేస్తుంటే, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అస్సలు ఉత్సాహామే కనిపించడంలేదు. స్వయంగా చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రజా ఉద్యమాలు ఆందోళనలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని పదేపదే చెబుతున్నా, పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించి, వారి ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఆ పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా, మాజీ మంత్రి ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పేరును తెరపైకి తెచ్చారు. కొద్ది రోజులుగా ఆయనే కాబోయే టీడీపీ అధ్యక్షుడు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల ఆయన ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు. ఇప్పుడు బెయిల్ పై బయటకి వచ్చారు. కానీ ఆయన పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడంతో, ఇదే అదునుగా భావిస్తున్న విశాఖ జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొద్దిరోజులుగా బాగా యాక్టివ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు. ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ, జగన్ ను వేలెత్తి చూపిస్తున్నారు.
ఒక్కసారిగా ఆయన ఈ విధంగా యాక్టివ్ కావడం, పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. త్వరలోనే టిడిపి ఏపీ అధ్యక్షుడు నియామకం ఉన్న నేపథ్యంలో, చంద్రబాబు తన పేరును పరిగణనలోకి తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా యాక్టివ్ అయ్యారని, ఈ మధ్యకాలంలో ఆయనపై కేసు నమోదు అయినా ఈ విషయాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీలో మరింతగా యాక్టివ్ అవ్వడానికి కారణం అదేననే విశ్లేషణలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు ఎవరు వైపు మొగ్గు చూపుతారు అనేది తేలాల్సి ఉంది. అచ్చెన్న, అయ్యన్న ఇద్దరూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే కాకుండా, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పేలా కనిపించడం లేదు. అసలు బాబు మనసులో ఎవరున్నారో ? ఆయన మనసులో మాట ఎప్పుడు బయటపెడతాడో ?