భారత్, చైనాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య మరోమారు సైనిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తలను తొలగించడంలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు కమాండ్ స్థాయి అధికారులు సమావేశకానున్నారు. తూర్పు లఢక్ సమీపంలో చైనా భూభాగంలో ఉన్న మోల్డోలో ఈ సమావేశం జరుగుతుందని మిలటరీ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, నియంత్రణరేఖ వద్ద ఉన్నప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాంగాంగ్ సరస్సుతోపాటు పర్వతశ్రేణుల్లో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వాటిని నివారించడంలో భాగంగా గతంలో చేసుకున్న ఒప్పందాలు, వాటి ఉల్లంఘనలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత జూన్ 15న ఇరు దేశాల సైనికులు లఢక్‌లోని గల్వాన్ లోయలో పరస్పరం దాడులు చేసుకున్నవిషయం తెలిసిందే. ఇందులో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలోనే తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్‌ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది.