చింతమనేని రిమాండ్ నేటితో పూర్తి..

టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండ్‌ను ఏలూరు కోర్టు ఈ నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భాక‌ర్ రిమాండ్ నేటితో ముగిసింది. ఈ క్ర‌మంలోనే జిల్లా జైలు నుంచి చింతమనేనిని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. మాజీ సర్పంచ్‌ మేడికొండ వెంకటసాంబ కృష్ణారావు అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసులో చింతమనేనిని కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.

2018లో పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టు మట్టి తరలింపు వ్యవహారంపై గ్రామానికి చెందిన కృష్ణారావు ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. చింతమనేని ఫిర్యాదుదారుడిని తన ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనపై పెదవేగి పోలీస్‌ స్టేషన్‌లో 2018లోనే క్రైం సంఖ్య 248/2018గా నమోదు అయింది.