ఈ నేపథ్యంలోనే 150 మూవీలు చేసి, తెలుగు నాట గుర్తింపు పొందిన మెగా స్టార్ విషయంలోనూ ప్రజలు ఇలానే డిసైడ్ అయ్యారు. 2008లో సొంతంగా పార్టీ పెట్టుకుని, అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు చిరంజీవి. దీనికి ముందు వెనుకల చాలా రాజకీయం ఉందని అనుకోండి. ఏదేమైనా తెరమీదకి మాత్రం చిరు మాత్రమే వచ్చారు.
దీంతో ఆ ఎన్నికల్లో హోరా హోరీ ప్రచారం చేశారు. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీని సైతం టార్గెట్ చేశారు. సమాజంలో మార్పు తీసుకు వస్తామని చెప్పారు. ఇలా తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకునేందుకు ముందుకు సాగారు. కానీ, ఎన్నికల మేనేజ్‌మెంట్ విషయానికి వస్తే.. మాత్రం చిరు చతికిల పడ్డారు. ప్రజల్లో ఆయనపై అభిమానం ఉంది. కానీ, పోలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం చిరును పక్కన పెట్టారు. ఇక, ఆ తర్వాతైనా.. ప్రజల్లో ఉండి.. పోరాడి, వారి సమస్యలను పరిష్కరించేలా చూడడంలోను, ముందుండి పార్టీని నడిపించడంలోను కూడా చిరు విఫలమయ్యారనే పెద్దమాట వాడాల్సిందే!
దీంతో ఆయన ఇక, తనకు రాజకీయాలు సరిపోవంటూ… జెండా పీకేయడం, కాంగ్రెస్‌లో విలీనం చేయ డం.. వంటి పరిణామాలు జరిగిపోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా సినిమాలు చేసుకుం టున్నారు అయితే, ఆయనకున్న చరిష్మాను తాము వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుండడం మరో సారి రాజకీయంగా చిరు పేరు వినిపించేలా చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. చిరు వద్దకు వెళ్లడం, ఆయనతో భేటీ కావడం వంటి పరిణామాలు అన్నీ కూడా బీజేపీ కనుసన్నల్లోనే సాగుతు న్నాయని, చిరును తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు.
అయితే, తనకున్న చరిష్మాతో తన సొంత పార్టీని నిలబెట్టుకోలేని చిరు.. ఇప్పుడు ఏమాత్రం పసలేని బీజేపీ కోసం.. అందునా.. మతాలతో ముడిపడిన పార్టీ కోసం ఆయన నడుం బిగించి ప్రజల్లో ఉంటారా ? అనే మిలియన్ డాలర్ల ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఏదేమైనా.. బీజేపీ కోసం చిరు కండువా కప్పుకొంటారంటే.. నమ్మలేకపోతున్నామని అనేవారు పెరుగుతుండడం గమనార్హం.