ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్‌పై చెంపదెబ్బ ఎఫెక్ట్ పడింది. దాంతో వచ్చే ఏడాది(2023) ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాతగా అలరించేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది ప్రారంభంలో యావత్ ప్రపంచం ఆస్కార్ అవార్డు వేడుకను ఆసక్తిగా తిలకిస్తోన్న సమయంలో వేదికపై క్రిస్‌రాక్ చెంప దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. తన సతీమణి అనారోగ్యంపై జోకులు వేయడం తట్టుకోలేకపోయిన అగ్ర నటుడు విల్ స్మిత్.. క్రిస్ చెంప పగలగొట్టారు.
తాజాగా ఆయన మరోసారి ఆస్కార్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాలంటూ ఆఫర్ వచ్చింది. దీనిపై అరిజోనాలోని ఓ కామెడీ సెట్‌లో మాట్లాడుతూ.. ఇంకోసారి ఆస్కార్ వేడుకలకు వెళ్లడాన్ని నేరం జరిగిన ప్రాంతానికి తిరిగి వెళ్లడంగా పోల్చుతూ క్రిస్ స్పందించారని అరిజోనా రిపబ్లిక్ వెల్లడించింది. అలాగే స్మిత్ గురించి మాట్లాడుతూ..‘ఆయన నా కంటే పెద్దవాడు. ఆ ప్రాంతం మరోసారి మా మధ్య ఈ తరహా పోరాటానికి అనుమతించదు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన తర్వాత క్రిస్.. ఒక సూపర్ బౌల్ యాడ్‌ను కూడా తిరస్కరించారు.
94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా క్రిస్ రాక్ ఓ కామెడీ ట్రాక్‌ను చెబుతూ అందులో విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్ రాక్ ఆమెను ‘జీ.ఐ.జేన్’ చిత్రంలో ‘డెమి మూర్’ పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్ స్మిత్ నేరుగా వేదికపై వెళ్లి క్రిస్ చెంప పగలగొట్టారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.
అయితే ఈ ఘటనపై వేదికపైనే స్పందించిన స్మిత్ అకాడమీకి, సహచరులకు క్షమాపణలు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ క్రిస్ రాక్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకే అలా ప్రవర్తించానని రాసుకొచ్చారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర వివాదానికి దారితీసి..స్మిత్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.