రామతీర్థం ఘటన : సీఐడీ డీజీ కీలక ప్రకటన

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై సీఐడీ దర్యాప్తు వేగంవంతమయింది. దుండగులు దాడిలో దెబ్బతిన్న కోదండరామ స్వామి విగ్రహాన్ని సీఐడీ అడిషనల్ డీజీ సినీల్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “రామతీర్థం విగ్రహం దాడి ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని, పక్కా ప్రణాళికతో పకడ్బందీగా చేసిన చర్య అని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం, సమాజంలో వివాదాలు సృష్టించబడం ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని ఆలయం గురించి సమగ్రంగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని అన్నారు.

ఆకతాయిలు చర్యగా భావించడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న ఆయన సంఘటన స్థలంలో హ్యాక్ సా బ్లేడ్ దొరికిందని అన్నారు. స్థానికులు కానీ వారి సహాకారంతో బయటి వ్యక్తులు కానీ విగ్రహంపై దాడికి పాల్పడి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. సుమారు 400 మీటర్ల ఎత్తు,300 మెట్లు ఉన్న కొండపై ఆలయానికి చేరుకుని విగ్రహం ధ్వంసం చేయడం సాధారణమైన విషయం కాదన్న ఆయన త్వరలోనే నిందితులను ప్రకటిస్తామని అన్నారు.