కరోనా మహమ్మారికి గాను పలు ఫార్మా కంపెనీలు రెమ్‌డెసివిర్ మందును విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అత్యవసర స్థితి ఉన్న కరోనా రోగులకు ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుందని గుర్తించడంతో దీన్ని ఆ పేషెంట్లకు వాడుతున్నారు. అయితే పలు కంపెనీలు భారీ ధరలకు ఈ మందును విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లోనూ ఈ మెడిసిన్‌ను రూ.30వేలకు పైగానే అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పలు కంపెనీలు ఈ మెడిసిన్‌కు జనరిక్ వెర్షన్‌ను తయారు చేసి విడుదల చేస్తున్నాయి.
ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా.. రెమ్‌డెసివిర్‌కు చెందిన జనరిక్ మందును చాలా తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ తయారు చేసిన రెమ్‌డెసివిర్ 100 ఎంజీ వయల్ ధరను రూ.4వేలుగా నిర్ణయించారు. కాగా హెటిరో సంస్థ ఇదే మెడిసిన్‌ను రూ.5,400కు అమ్ముతుండగా, మైలాన్ కంపెనీ రూ.4,800కు అమ్ముతున్నట్లు తెలిపింది. ఇక ఈ మెడిసిన్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్మకుండా చూసేందుకు గాను హెటిరో సంస్థ తమ వెబ్‌సైట్ ద్వారా ఈ మెడిసిన్‌ను నేరుగా కస్టమర్లకే విక్రయిస్తున్నట్లు తెలిపింది.
తాము తయారు చేసిన రెమ్‌డెసివిర్ జనరిక్ మెడిసిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి కూడా లభించిందని సిప్లా తెలిపింది. ఈ క్రమంలో సిప్లాకు చెందిన రెమ్‌డెసివిర్ మెడిసిన్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.