నకిలీ వార్తలపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్య ఉద్రిక్తతలు, విద్వేషాలు సృష్టిస్తాయని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో బుధవారం జరిగిన 16వ రామ్‌నాథ్ గోయెంకా అవార్డుల ప్రదానోత్సవానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాధ్యతాయుతమైన జర్నలిజం దేశ ప్రజాస్వామ్యాన్ని మెరుగైన దిశగా నడిపించే ఇంజిన్ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్ యుగంలో జర్నలిస్టులు తమ రిపోర్టింగ్‌లో కచ్చితంగా, నిష్పాక్షికత, బాధ్యతాయుతంగా, భయం లేకుండా ఉండటం ముఖ్యమని అన్నారు. ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లాలి అంటే మీడియా స్వేచ్ఛ ముఖ్యమని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కత్తి కంటే కలం గొప్పదనే విషయాన్ని యావత్తు లోకం విశ్వసిస్తుందని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో సామాజిక, రాజకీయ మార్పుల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర వార్తాపత్రికలకు ఉన్నదని వెల్లడించారు.