రాజస్థాన్‌లో రాజకీయ తమాషాను ప్రధాని నరేంద్ర మోదీయే ఆపాలన్నారు సీఎం అశోక్ గహ్లెత్. తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం క్షమిస్తే రాజస్థాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన సచిన్ పైలట్ వర్గాన్ని తిరిగి పార్టీలోకి అహ్వానిస్తానని చెప్పారు గహ్లోత్. తనకు మూడు సార్లు సీఎం అవకాశం ఇచ్చిన పార్టీ.. ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని స్పష్టం చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తన మద్దతుదారుల మకాంను జైపుర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్ నుంచి జైసల్మేర్‌లోని సూర్యగఢ్ రిసార్టుకు మార్చారు గహ్లోత్. అక్కడే ఒకరోజు ఉండి తిరిగి జైపుర్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. మరోమారు పైలట్‌పై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నగదు ఆశను భారీగా పెంచారని ఆరోపించారు గహ్లెత్. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ తన ప్రభుత్వంపైనే దృష్టి సారించిందన్నారు.