21వ శతాబ్ధం విజ్ఞాన యుగం: ప్రధాని మోదీ..!

భారత్‌లో నాణ్యమైన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. మన దేశంలోని విద్యార్థుల కోసం అధునాతన విద్యావ్యవస్థను అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020లో పాల్గొన్న విద్యార్థులనుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. 21వ శతాబ్దం విజ్ఞాన యుగమని, లెర్నింగ్‌, రీసెర్చ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సదుపాయాలను మరింత ప్రభావవంతంగా,స్నేహపూర్వకంగా,పరస్పర సహకారంతో నిర్వహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గొప్పగా ఉపయోగపడుతుందన్నారు.

వరదల సమయంలో ఆనకట్టలు తెగకుండా శ్రీ కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ పరిష్కార మార్గం కనిపెట్టినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ మాడ్యుల్‌ను కూడా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రూ.1కే శానిటర్స్ పాడ్స్ అందిస్తోంది. రీయూజ్ చేయదగిన శానిటరీ నాప్కిన్స్‌ను తీసుకురావడం ద్వారా మహిళలకు పెద్ద మేలు చేసినట్లవుతుంది. ఇలాంటి ఆలోచనను అమలులో పెట్టేందుకు పనిచేస్తున్న విద్యార్థిని నేను అభినందిస్తున్నాను.’ అని ఓ విద్యార్థిని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.