అసెంబ్లీలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో వందేళ్లలో ఎప్పుడూ ఇంత వర్షాలు పడలేదని చెప్పారు. ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో వర్షాలు కురిశాయన్నారు. వర్షాలతో కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఫించా, అన్నమయ్య ప్రాజక్టుల దిగువన ఉన్న గ్రామాలు ఎక్కువగా నష్టపోయాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి ప్రతిపక్షనేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు నేనే వెళ్లి ఆపాను…తిత్లీ వచ్చినప్పుడు నేనే ఆపాను అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని చెప్పారు. హడావుడి చేసి డ్రామాలు చేశారని…అరకొర సాయం కూడా చేయలేకపోయారని సీఎ విమర్శించారు. తాను వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నానని కానీ సీనియర్ అధికారుల సూచన మేరకే ఆగిపోయానని అన్నారు. తాను వెళితే అధికారులు తనపైనే దృష్టిపెడతారని..సహాయక చర్యలను పట్టించుకోరని తాను పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలిపారు. తను వెళ్లడం కంటే బాధితులకు సహాయం అందడయే ముఖ్యమని వ్యాఖ్యానించారు.