అమరావతి : ఓటీఎస్ పై ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు సీఎం జగన్. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. 20వేలు కట్టి ఓటీఎస్ తీసుకోవటం ద్వారా ఎటువంటి లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్ లబ్దిదారులకు వస్తుందని పేర్కొన్నారు. ఆ కాగితాలను బ్యాంకులో పెట్టి మూడు లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
దీని వల్ల లబ్దిదారులు మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఉచిత రిజిస్ట్రేన్, ఉచిత స్టాంప్ డ్యూటీ వల్ల 1600 కోట్ల రూపాయలు పేద వర్గాలకు లాభం చేకూరిందని తెలిపారు సిఎం జగన్. రుణమాఫీ ద్వారా మరో పదివేల కోట్ల రూపాయల లబ్ది జరిగిందని స్పష్టం చేశారు.