పది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల పై ఏపీ సీఎం జగన్ కలెక్టర్లు, అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. కృష్ణమ్మ వరద పంటలను నిలువునా ముంచింది. వారం రోజుల వరదతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పసుపు, కంద, తమలపాకు తోటలు నీటమునిగి కుళ్లిపోయాయి.
అరటి, బొప్పాయి పంటలకు అపారనష్టం కలిగింది. భారీ వరదలు కౌలు, చిన్న, సన్నకారు రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. ఈ నెల 31లోపు పంట నష్టం అంచనాలు, బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి చేయాలని జగన్ అధికారులని ఆదేశించారు. వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని ఆయన కోరారు. కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. పది రోజుల నుంచీ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయని, ప్రజలు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ కోరారు.