రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విస్తరించిన నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య సర్వే నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన రోగాలతో పాటుగా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి హెల్త్ కండీషన్‌పై సర్వే నిర్వహించాలని ఆ తర్వాత సర్వే వివరాలకు సంబంధించి తగిన విధంగా రికార్డులు నిర్వహించి, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే చెయ్యాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.
గురువారం జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు ఈ ఆదేశాలు జారి చేసారు తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచనలు చేసారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని.. ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించిన జగన్, ప్రతిపాదిత కొత్త మెడికల్ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్ చేయాలని ప్రజలకు జగన్ సూచించారు. గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలన్న ఆయన, అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా పంటలు పరిస్థితులు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చని ప్రజలకు సూచించారు.