ఆరోగ్యశ్రీ కార్డు దారులకు సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటన చేశారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలన్న సీఎం వైయస్.జగన్.. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందన్నారు.
ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. వైద్య రంగం విషయానికొస్తే.. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేశాం… వేల కోట్లను ఈ రంగంపై ఖర్చు చేస్తున్నామన్నారు. విలేజ్ / వార్డు క్లినిక్స్ దగ్గరనుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని.. ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచాం.. 16 టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామని పేర్కొన్నారు.