దామరచర్లలో నిర్మాణంలో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్ఆనరు సీఎం కేసీఆర్. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు పలువురు
ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు యావత్ దేశ కీర్తిని పెంచుతుందని సీఎం పేర్కొన్నారు.
4 వేల మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని తెలిపారు. పవర్ ప్లాంట్‌లో పని చేసే 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిబ్బంది క్వార్టర్స్, మౌలిక సదుపాయాల కల్పనకు 100 ఎకరాలు సేకరించాలి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు 50 ఎకరాలు ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రయివేటు సర్వీస్ సిబ్బందికి కూడా క్వార్టర్లు నిర్మించాలన్నారు. దామరచర్ల హైవే నుంచి పవర్ ప్లాంట్ వరకు 7 కిలోమీటర్ల మేర ఫోర్ లైన్ సీసీ రోడ్లు నిర్మించాలన్నారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్‌వోబీ నిర్మాణంతో పాటు దామరచర్ల రైల్వే స్టేషన్ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.