గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే ఇంకో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులుతో భారీ వర్షాలపై సీఎ కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి ఏం మాట్లాడారో భగవంతుడికే తెలియాలంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనకు ముందు మాట్లాడిన కొందరు కేంద్ర మంత్రులు ఏదో కేసీఆర్‌ను తిట్టి నోటిదూల తీర్చుకునిపోయారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. అంతేకాకుండా.. ప్రధాని మోదీకి నిక్కచ్చిగా కొన్ని ప్రశ్నలు వేశాం.. ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు.. తెలంగాణకు వాళ్లు చేసిందీ లేదు.. అయ్యేదీ లేదు అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. లోడ లోడ మాట్లాడగానే సరిపోతుందా… ఇక్కడా ఎవరు నమ్మే వాళ్ళు లేరని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని లోనే కరెంట్ కోతలు, నీటి కొరత ఉన్నాయని, నిరుద్యోగ రేటు ఎప్పుడు లేనంతగా పెరిగి పోయిందని ఆరోపించారు కేసీఆర్. మీ సమావేశాలకు రాంగ్ ప్లేస్ సెలక్ట్ చేసుకున్నారని, మీ తెలివి తక్కువ విధానాల వల్ల దేశాన్ని నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు కేసీఆర్.