గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. హైదరాబాద్లోని రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల వైసీపీ – తెరాస నేతలపై విమర్శలు చేసిన పవన్ తెరాస అధినేతతో ముచ్చటించడం అందరిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో నాన్ కాంగ్రెస్ – నాన్ భాజపా కూటిమి ఏర్పాటులో భాగంగా ఇప్పటికే వైసీపీ మద్దతు కోరుతూ.. ఆ పార్టీ అధినేత జగన్ తో కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో నేడు సీఎం కేసీఆర్ పవన్ తో సంభాషించడం కూడా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగమనే తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది సేపటికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తోనూ ఆయన మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత జానారెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఎం చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.