పంటనష్టంపై కేంద్రానికి నివేదిక పంపదల్చుకోలేదు : సీఎం కేసీఆర్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు అభయమిచ్చారు. నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. రావినూతలలో రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 32 ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే 20 ఎకరాల్లో నష్టం జరిగిందని తెలిపారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను రైతులు కోరారు.

మొత్తం 1.29 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం కలిగిందని అధికారులు సీఎంకు వివరించారు. 79వేల ఎకరాల్లో వరి పంట పాడైందని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎకరాకు రూ.10వేలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

పంట నష్టంపై నివేదికను కేంద్రానికి పంపించదల్చుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రానికి గతంలో నివేదిక పంపించామని.. అయినా నయాపైసా ఇవ్వలేదని అన్నారు. కేంద్రానికి నిరసనగా నివేదిక పంపించడం లేదని స్పష్టం చేశారు. అయినా రైతులు నిరాశ చెందవద్దని సూచించారు. కౌలు రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news