Breaking : వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక

-

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలపై .. ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది తన జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతున్నదన్నారు. గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయని, ఈ నేపథ్యంలో పడ్డ చుక్క పడ్డట్టే వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటున్నాయని ఆయన తెలిపారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్శాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉన్నదని అధికారులను సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమన్న కేసీఆర్‌.. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదన్నారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్‌.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో… ఇపుడు కురిసే వానలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉధృతంగా ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని సీఎం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version