కర్ణాటక సీఎం కుమారస్వామి వైటీపీఎస్ కార్మికులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీరు మోదీకి ఓటు వేసి ప్రధానిని చేశారు.. సమస్యలను పరిష్కరించమని నా దగ్గరకు ఎందుకు వచ్చారు..? అని అన్నారు.
ప్రజా ప్రతినిధి అన్నాక ప్రజల సమస్యలను సావధానంగా వినాలి. వారు చెప్పే సమస్యలను, వారి బాధలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని చెప్పి నేతలు హామీ ఇవ్వాలి. లేకపోతే వారు ప్రజా ప్రతినిధిగా ఎన్నికవడంలో అర్థం లేదు కదా. అయితే ఇదంతా ఏమీ పట్టించుకోని కర్ణాటక సీఎం కుమారస్వామి కొందరు కార్మికులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని రాయచూర్ శివారులో ఉన్న ఎర్మరస్ సర్క్యూట్ హౌస్ ఎదుట ఎర్మరస్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) కార్మికులు కొందరు నిన్న నిరసన చేపట్టారు. పవర్ స్టేషన్ కోసం భూములను కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని, విధుల నుంచి అన్యాయంగా తొలగించబడిన కార్మికులను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని, క్యాజువర్ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు ఆ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే అదే సమయంలో అటుగా సీఎం కుమారస్వామి కాన్వాయ్‌లో వచ్చారు. కార్మికుల ఆందోళన తెలుసుకుని వారితో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఉన్నట్టుండి సీఎంకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. అలాగే ఆయన కాన్వాయ్‌కు ఎదురుగా కార్మికులు కొందరు రోడ్డుపై బైఠాయించారు.
అయితే తనకు వ్యతిరేకంగా పలువురు కార్మికులు నినాదాలు చేయడంతో సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘మీరు మోదీకి ఓటు వేసి ప్రధానిని చేశారు.. సమస్యలను పరిష్కరించమని నా దగ్గరకు ఎందుకు వచ్చారు..?’ అని అన్నారు.. దీంతో ఈ విషయం వివాదాస్పదం అయింది. కాగా దీనిపై సీఎం కుమారస్వామి తరువాత వివరణ ఇచ్చారు. తాను ఆ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పానని, అయినప్పటికీ వారు అది వినిపించుకోకుండా తన కాన్వాయ్‌కు ఎదురుగా బైఠాయించడం, తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం సరికాదని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశానని, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని.. అన్నారు. అయితే దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు మండి పడుతున్నారు. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి.. కార్మికులు తమ సమస్యలను పరిష్కరించమని అడిగితే.. అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కుమారస్వామి వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..!