ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇతర విమాన సంస్థలతో పోటీ పడలేకపోతున్న ఎయిర్ ఇండియా మరోసారి అప్రతిష్ట పాలైంది. సాధారణంగా చాలా మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా అంత చెత్త విమాన సర్వీస్ ఇంకొకటి లేదని చెబుతుంటారు. అయినప్పటికీ ఆ కంపెనీ తమ తప్పులను తెలుసుకుని ప్రయాణికులకు సేవలను అందించడంలో ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. తాజాగా ఆ కంపెనీకి చెందిన ఓ విమానంలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ ప్రయాణికుడికి అందులో బొద్దింక వచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా పరువు పోయింది.
రోహిత్ రాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఈ నెల 3వ తేదీన భోపాల్ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తున్నాడు. అందులో భాగంగా అతను మార్గమధ్యలో ఇడ్లి-వడ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో అతని వద్దకు వచ్చిన ఫుడ్‌ను సీల్ తీసి తినే ప్రయత్నంలో అతనికి సాంబార్‌లో బొద్దింక కనిపించింది. దీంతో వెంటనే అతను ఆ ఫుడ్ ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్ అయింది.
అయితే ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు మేలుకున్న ఎయిర్ ఇండియా అధికారులు ఇవాళ స్పందించారు. తమ విమానంలో జరిగిన ఆ ఘటనకు ఎంతో చింతిస్తున్నామని, తాము ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. అలాగే ఫుడ్ సప్లై చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని, తాము ప్రయాణికుడితో టచ్‌లో ఉన్నామని, అతనికి కావల్సిన సహకారం అందిస్తామని, అతనికి క్షమాపణలు చెబుతున్నామని కూడా ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఏది ఏమైనా.. అసలే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు ఇలాంటి ఘటనలు మరింత చేటు తెచ్చేవే. కాదంటారా..!