అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఆమోదించిందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.
రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండీలో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ…. స్థానిక బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ .. యువత, ఆడబిడ్డల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఆమెపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. వారు చేసిన వ్యాఖ్యలు మండి, హిమాచల్‌కే అవమానకరమని అన్నారు .దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండి అభివృద్ధికి పాటుపడతారని మోడీ హామీ ఇచ్చారు.గత ఏడాది భారీ వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికే పంచిపెట్టిందని, మిగతా డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తాము అధికారంలోకి వచ్చాక వెలికితీస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.