తెలంగాణ కాంగ్రెస్‌కి వరస సమస్యలు ఎన్నికల రూపంలో వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమే పలకరిస్తోంది. పరాజయాలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. అన్నీ వరస సమస్యలే. ఒకవైపు పరాజయాలు పలకరిస్తుంటే.. మరోవైపు వరస ఎన్నికలు నాయకుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ కష్టాల కడలిలో ప్రయాణం సాగిస్తుంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త చీఫ్ నియామక ప్రక్రియకు కసరత్తు మొదలుపెట్టింది ఏఐసీసీ. అది మధ్యలోనే ఆగిపోయింది. పూర్తిస్థాయి పీసీసీ లేక.. ఉన్నవాళ్లు ఏం చేయాలో.. ఎలా చేయాలో ఆదేశాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పీసీసీ సారథిగా దిగిపోతూ.. ఎందుకులే అని అనుకున్నారో ఏమో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లైట్ తీసుకుంటున్నారట.
2019 లోక్‌సభ ఎన్నికల్లో 3 చోట్ల గెలిచి కొంత తేరుకున్నారు. అది తప్ప అన్ని ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలే. ఇటీవల ముగిసిన దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌ది మూడో ప్లేస్. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లు ఉంటే రెండుచోట్లే గెలిచింది. ప్రస్తుతం అందరి ఆశలు నాగార్జునసాగర్ బైఎలక్షన్ రిజల్ట్స్‌పై ఉన్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయడంతో పార్టీ అంతా కదిలి వచ్చింది. స్థానికంగా జానారెడ్డికి పలుకుబడి.. గుర్తింపు ఉన్నా టీఆర్‌ఎస్, బీజేపీలను ఢీకొట్టడానికి శక్తినంతా కూడదీసుకుంది కాంగ్రెస్. మే 2న కాంగ్రెస్‌తోపాటు జానారెడ్డి భవితవ్యం ఏంటో తేలుతుంది.
ఈ ఉపఎన్నిక నుంచి తేరుకోక ముందే మినీ పురపోరు వచ్చింది. రెండు కీలక మున్సిపల్ కార్పొరేషన్లు వరంగల్, ఖమ్మంతోపాటు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పరాజయాలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయట. పైగా ఖమ్మం ఎన్నిక పార్టీలో మరో పెద్ద నాయకుడికి సవాల్ అని చెబుతున్నారు. వరంగల్ కూడా అలాగే ఉంది. వరస ఎన్నికల ప్రచారాల్లో అలిసి.. ఓటములతో విసిగి ఉన్న కేడర్ ఏ మేరకు పోరాటం చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయట. గెలుపు మాట ఎలా ఉన్నా వరుస ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ ని ఊపిరి సలపనివ్వడం లేదు.