ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడిన ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియా ప్రకటన రిలీజ్ చేశారు.అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని విమర్శించారు. రూ.6 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందా? రూ.లక్ష రుణం మాఫీ చేశామని చెబుతూ.. రూ.2లక్షలు మాఫీ చేసినట్లు ప్రకటనలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారం చూస్తే గోబెల్స్ కూడా మూర్చపోతారని ఆయన ఎద్దేవా చేశారు. యాసంగి రైతుబంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. రైతు భరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వానాకాలం రైతుభరోసా ఊసే లేదని ఫైర్ అయ్యారు. 1.30 కోట్ల ఎకరాలకే ఇస్తారనుకున్న రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారని, రుణమాఫీ అంటూ ఇప్పుడు రూ.6 వేల కోట్లు ఇచ్చారని అదేవిధంగా రూ.10 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు.