దేశ చరిత్రలోనే ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ ఎప్పుడు జరగలేదని.. ఇదే తొలిసారి అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.అది కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. గురువారం దేశాయిపేట రైతు వేదికపై ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇదో గొప్ప సంఘటనని.. రైతుల జీవితంలో ఇంత వరకు జరగని సంఘటన ఇప్పుడు జరుగుతుందని అన్నారు.
తాను 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేశామని, అదీకూడా రూ.25 వేలు చొప్పున నాలుగు విడతలుగా చేశామని అన్నారు. అందుకోసం నాడు రూ.16,170 కోట్లు ఖర్చు అయిందని, అయితే 2018 అనంతరం రెండో విడత ప్రభుత్వంలో రూ. 20 వేల కోట్ల రుణాలు ఉండగా.. రూ.12 వేల కోట్ల వరకు మాత్రమే అందించారని తెలిపారు. ఇంకా రూ. 8 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ కాలేదని ,కానీ నలబై లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు.. రెండు లక్షల రూపాయల వరకు ఒకేసారి అందించడం మాత్రం ఇండియాలో ఇదే ప్రధమం అని అన్నారు.ఇలాంటిది గతంలో ఎప్పుడు జరగలేదని… అందుకే సంబురాలు చేసుకుంటున్నామని ఎమ్మెల్యే పోచారం తెలిపారు.