అయోధ్యలో రామమందిర నిర్మాణం.. బాబ్రీ మసీదు కూల్చివేత వంటి విషయాలు భారతదేశ రాజకీయ, సామాజిక, మతపరమైన అంశాల్లో అత్యంత కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ఈ క్రమంలో… అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పూజకు ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ విషయాలపై స్పందించారు.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ! ఆయనకు బండి సంజయ్ తనదైన శైలిలో సమాధానలు ఇచ్చేశారు! ఆ సంగతులు అలా ఉంటే… ఈ కొత్త రామమందిరం ఏస్థాయిలో నిర్మించబడుతుందో ఇప్పుడు చూద్దాం!
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త రామ మందిరాన్ని మొత్తం రెండంతస్తుల్లో కట్టనున్నారు. ఆ మందిరం ఎత్తు 128 అడుగులు కాగా వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులుగా ఉండనుంది. మొదటి అంతస్తులో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనుండగా.. రెండో అంతస్థు పైభాగాన శిఖరం ఉంటుంది. 67 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ స్థలం కోసం రూ.500 కోట్లు కేటాయించారు!
ఈ ప్రధాన ఆలయం చుట్టూ సీత మందిర్, భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, గణేష్ మందిర్ అనే నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి. ఆ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్. భోజనశాల, ధర్మశాల. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి.
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లో ప్లాన్ రూపొందించారు. చంద్రకాంత్ సోంపుర కుటుంబానికి దేశంలోని ఎన్నో ఆలయాలను డిజైన్ చేసిన ఘనత ఉంది. గుజరాత్‌లో అరేబియా సముద్రం తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం రూపకల్పన చేసింది కూడా చంద్రకాంత్ సోంపుర తాతగారే కావడం గమనార్హం.