రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేయడంపై వివాదం రాజుకుంటోంది. ఓ ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్నది అర్ణబ్ గోస్వామిపై ఆరోపణ. అయితే, అతన్ని అదుపులోకి తీసుకున్న తీరుపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు… అర్నబ్‌ను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చడంతో… ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు.
అర్ణబ్ ఇంట్లోకి రాయిగఢ్, ముంబయి పోలీసులు సంయుక్తంగా ప్రవేశించడంతో పాటు అతన్ని బలవంతంగా తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే, అర్ణబ్ సహకరించకపోవడం వల్లే పోలీసుల బలప్రయోగం చేశారంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. సచిన్ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్ గోస్వామిని అదుపులోకి తీసుకుంది. అయితే, పోలీసులు తనపై దాడి చేసి గాయపర్చారని అర్ణబ్ ఆరోపించారు. తన చేతులపై గాయాలయ్యాయంటూ చూపించారు.
2018లో కాన్‌కార్డ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. తనకు చెల్లించాల్సిన 5 కోట్ల 40 లక్షలు ఇవ్వకుండా అర్ణబ్‌తో పాటు మరో ఇద్దరు తనను మోసం చేశారని ఇంటీరియర్ డిజైనర్ సూసైడ్ నోట్‌లో రాశారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపారు. 2018లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు… తర్వాత కొట్టేశారు. అయితే, ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని ఇటీవల అన్వయ్ కూతురు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇప్పుడు రాజకీయరంగు పులుముకోవడంతో అటు మీడియా ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.