జనం భయం, జనం అవసరం, జనం ఆందోళన, జనం ఆవేదన మన వ్యాపారం. దేశంలో ఉన్న అందరు వ్యాపారులు ఇప్పుడు కరోనాను అడ్డం పెట్టుకుని ఇదే విధమైన వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా ఎక్కడ చూసినా సరే ప్రజల అవసరం ఆధారంగా చేసుకుని వ్యాపారులు చెలరేగిపోతున్నారు. జనతా కర్ఫ్యూ ముగియడం తో సరుకుల కోసం జనం రోడ్ల మీదకు వస్తున్నారు.
దీనితో వ్యాపారులు భారీగా ధరలు పెంచేశారు. ముఖ్యంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో ఎక్కువగా కూరగాయల ధరలను పెంచేశారు వ్యాపారులు, దీనితో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే వినే పరిస్థితి ఉండటం లేదు. ఒక పక్క ప్రభుత్వం హెచ్చరించినా సరే వినడం లేదు. జనాల అవసరం ఆధారంగా చేసుకుని రెచ్చిపోతున్నారు.
కూకటపల్లి, మెహదీపట్నం, చాలా రైతు బజారులలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న వస్తువులను కూడా ధరలు పెంచి విక్రయించడం తో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్నారు. సరూర్ నగర్ రైతు బజార్‌లో కొనుగోలుదారులు, వ్యాపారుల మధ్య గొడవ కూడా జరిగింది.