కోవిడ్-19 మహమ్మారి సృష్టిస్తున్న విలయం ఇంకా కొనసాగుతుంది. ఏడాది క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్ మరణాలు ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా మరణాల సంఖ్య ఇరవై ఐదు లక్షలకు చేరింది. టీకాలు వచ్చినప్పటికి అందరికీ చేరకపోవటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 11,26,18,488 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని, 25,00,172 మంది మృత్యు ఒడికి చేరుకున్నారని తాజాగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.
అత్యధికంగా మరణాలు అక్కడే..
కరోనా కేసులు మొదట చైనా దేశంలో నమోదైనా.. యూరప్ దేశాలపై ఎక్కవ ప్రభావం చూపించింది. 8,42,894 మరణాలతో ఆ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వతి స్థానంలో లాటిన్ అమెరికా, కరెబియన్ దేశాల్లో 6,67,972 మంది మృత్యువాతపడ్డారు. తీవ్రంగా ప్రభావితమైన అగ్రదేశం అమెరికా, దాని పొరుగునే ఉన్న కెనడాలో 5,28,039 మందిని వైరస్ బలి తీసుకుంది. ఆ జాబితాలో ఐదు లక్షల పైచిలుకు మరణాలతో అమెరికా ముందుండగా.. బ్రెజిల్, మెక్సికో, భారత్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ఆ నాలుగు నెలల్లోనే 10 లక్షల మరణాలు
జనవరి నెలలో కరోనా వైరస్ మొదటి మరణం కేసు చైనాలో నమోదైంది. అప్పటి నుంచి సెప్టెంబర్‌కు అంటే తొమ్మిది నెలల్లో పది లక్షల మరణాలు నమోదైతే అక్కడి నుంచి కేవలం నాలుగు నెలల్లోనే అంటే జనవరి 15 నాటికి మరో పది లక్షల మంది మృత్యు వాత పడ్డారు. జనవరి నెలాఖరు నుంచి మరణాలు కాస్త తగ్గముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా మరణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన దేశాల్లో.. ఇప్పుడు కాస్త తగ్గుదల కనిపిస్తోందని వెల్లడించింది. తాజాగా భారత్‌లో మరోసారి కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసులు 16వేలకు పైగా నమోదయ్యాయి. 16,577 కొత్త కేసులు నమోదు కాగా.. 120 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 1.10 కోట్లు దాటగా.. 1,56,825 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.