ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. కరోనా కట్టడికి ఆయన యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
బీహార్‌లోని మొత్తం కరోనా పాజిటివ్ కేసులలో మూడోవంతు ఒకే కుటుంబం నుంచి ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాజధాని పాట్నాకు 130 కిలోమీటర్ల దూరంలోని సివాన్ జిల్లా రాష్ట్రంలో అతిపెద్ద హాట్‌స్పాట్‌గా అవతరించింది.
మార్చి 16న ఒమన్ నుండి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా ఈ కరోనా గొలుసు విస్తరించిందని తెలిసింది. జిల్లాలోని పాంజ్వార్ గ్రామానికి ఒమన్ నుండి తిరిగివచ్చిన ఓ వ్యక్తికి ఏప్రిల్ 4న కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈలోగా ఆయన జిల్లాలో చాలా చోట్లకు ప్రయాణాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈయనతో పాటు కుటుంబంలోని మరో 22మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, గ్రామంలో మరో ఇద్దరికి కూడా కరోనా సోకిందని తెలుస్తోంది. చాలామందికి ఎటువంటి లక్షణాలు లేకున్నా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో అందరినీ ఆసుపత్రికి తరలించి గ్రామాన్ని సీల్ చేసారు.
కుటుంబంలోని 23మందిలో నలుగురు కోలుకోగా, మరో పదిమంది ఫలితాలు ఇంకా రావాల్సిఉంది. అయినా అందరినీ క్వారంటైన్‌లోనే ఉంచారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కరోనా క్లస్టర్‌గా మారిన సివాన్ జిల్లాలోని 43 గ్రామాలను పూర్తిగా దిగ్బంధించారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, ఆ వ్యక్తిని తాము పట్టుకోగలిగినందుకు సంతోషంగా ఉందనీ, అంతకుముందే విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన అందరిని పరీక్షించామని తెలిపారు. అయినా కరోనా కనిపించని శత్రువని, అన్ని రకాల ముందుజాగ్రత్తలు పాటిస్తూ, ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆయన ప్రజలకు సూచించారు.
బిహార్‌లో నేటికి మొత్తం 60 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 44 మంది చికిత్సలో ఉన్నారు. 15మంది కోలుకోగా, ఒకరు చనిపోయారు.