దేశంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరిగిపోతుండటంతో దాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. విదేశాల నుంచి దేశంలోకి వచ్చేవారి రాకపోకలపై ఆంక్షలు విధించింది. కరోనా మరింత విజృంభించకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆరోగ్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ముఖ్యంగా బీపీ, షుగర్, హృదయ సంబంధ రోగాలతో బాధపడుతున్న వారికి, వృద్ధులకు కరోనా సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అలాంటి వారికి వైరస్ సోకితే వేగంగా వ్యాధి ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. అందుకే ఇలాంటి వారు కరోనా సోకిన తర్వాత బాధపడటం కంటే.. ముందే మరింత అప్రమత్తంగా ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు.
చైనాలో కరోనా పాజిటివ్‌గా తేలి మరణించిన వారిలో చాలావరకు వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారే ఉన్నారని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దేశంలో కరోనా బారినపడి మరణించిన మొదటి రోగికి కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కర్ణాటకకు చెందిన ఈ 76 ఏండ్ల వృద్ధుడికి దీర్ఘకాల రోగాల కారణంగానే కరోనా సోకిందని వారు నిర్ధారించారు.
ఇదిలావుంటే, శుక్రవారం ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో 69 ఏండ్ల వృద్ధురాలు కరోనాతో మరణించింది. ఇటలీ నుంచి వచ్చిన తన కుమారుడి ద్వారా ఆమెకు కరోనా సోకింది. అయితే, వైరస్‌ను మోసుకొచ్చిన కొడుకు ఆరోగ్యం నిలకడగా ఉన్నా, అతని నుంచి వైరస్ సోకిన తల్లి మాత్రం చనిపోయింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలవల్ల ఆమెలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.