వైరస్ వచ్చిన మొదట్లో చూపించిన ఉత్సాహం రాను రానూ తగ్గిపోయిందనే విమర్శలు మూటగట్టుకున్నారు కేసీఆర్! వైరస్ వచ్చిన మొదట్లో… లాక్ డౌన్ అంటే ఏమిటో కూడా కొన్ని రాష్ట్రాలకు పూర్తి అవగాహన లేని సమయంలోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. జనం సహకరించడంలేదు అనుకున్నారో లేక నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు కానీ… కరోనా విషయంలో కేసీఆర్ సీరియస్ నెస్ తగ్గిందని మాత్రం అర్ధమవుతుందనే చెప్పాలి! ఈ క్రమంలో తాజాగా ప్రగతి భవన్ ను కూడా తాకింది కరోనా వైరస్!
అవును… ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో పలువురు సిబ్బందికి కరోనా సోకింది. ప్రగతి భవన్ లో పనిచేస్తున్నవారిలో ఇప్పటివరకు 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఎన్నో జాగ్రత్తలు పాటించే ప్రగతి భవన్ లోకి వైరస్ వ్యాపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడి సిబ్బందిలో ఎవరూ నేరుగా వైరస్ బారిన పడలేదు కానీ.. సీఎం నిర్వహించే కార్యక్రమాలు సమీక్షలకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు స్నాక్స్, భోజనం పెట్టేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన ఒక కేటరింగ్ సంస్థకు చెందిన ఏడుగురికి తొలుత మహమ్మారి సోకింది. ఆ విషయం బయటపడే లోపు వారి నుంచి ఇతరులకూ వ్యాపించింది.
అక్కడితో అయ్యిందనుకుంటే పొరపాటే… ముఖ్యమంత్రి భద్రతా విభాగం కీలక అధికారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే క్రమంలో డ్రైవర్లు, మిగతా సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో.. ఇకనుంచైనా కేసీఆర్ ఈ కరోనా విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కరోనా వచ్చిన కొత్తలో చూపించిన ఉత్సాహమే మళ్లీ చూపించాలని.. కరోనాతో సహజీవనం ఓకే కానీ… ఈ రేంజ్ లో కేసుల సంఖ్య పెరిగిపోతుంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాధం ఉందని.. చేతులు కాలాక ఆకులుపట్టుకోవడం సరైన విధానం కాదని అంటున్నారు.