కరోనా వైరస్‌ దేనిపై ఎంతకాలం జీవిస్తుందో తెలుసా!

482

కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్నది. ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఈ వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ను కనిపెట్టే పరిస్థితి లేకపోవడంతో అన్ని దేశాలు వ్యక్తులు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించేలా చర్యలు చేపడుతున్నాయి. కరోనా వైరస్‌ ఏ వస్తువులపై ఎంత కాలం జీవిస్తాయి అనే విషయంలో జనాలకు అవగాహన కల్పిస్తూ ఎవరికివారు సొంతంగా పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం కూడా కరోనా దేనిపై ఎంత కాలం జీవిస్తుందో తెలుసుకుని అప్రమత్తంగా ఉందాం..

కరోనా పేషెంట్‌ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వ్యక్తి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ కణాలు గాలిలోకి చేరుతాయి. ఈ కలుషిత గాలిని పీల్చినప్పుడు ఇతరులకు వైరస్‌ సోకుంతుంది. అయితే కరోనా వైరస్‌ గాలిలో మూడు గంటలు మాత్రమే జీవించి ఉంటుందట. కానీ, ఏదైనా వస్తువు ఉపరితలంపై వైరస్‌ కణాలు పడినప్పుడు మాత్రం ఆ వస్తువులోని మూల పదార్థం ఏది అనే దాన్నిబట్టి దాని జీవితకాలం నాలుగు గంటల నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. వైరస్‌ జీవించి ఉన్న సమయంలో సదరు వస్తువును చేతితో తాకి, అదే చేతితో ముక్కు లేదా నోటిని తుడుచుకుంటే కరోనా ఎటాక్‌ అవుతుంది.

పై వివరలనుబట్టి గాలిలో కంటే వస్తువుల ఉపరితలంపైనే కరోనా వైరస్‌ కణాలు ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. అంటే గాలిని పీల్చడం ద్వారా కంటే, అపరిశుభ్ర పరిసరాలను తాకిన చేతుల ద్వారా వైరస్‌ సంక్రిమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వైద్యులు.. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముఖంపై తాకడం, ఏదైనా తినడం చేయవద్దని సూచిస్తున్నారు. కరోనా కట్టడికి చేతి శుభ్రత చాలా ముఖ్యమని చెబుతున్నారు.

కాగా, గాలిలో మూడు గంటలు మాత్రమే జీవించి ఉండే కరోనా వైరస్‌ కణాలు.. రాగి లోహంతో తయారైన వస్తువులపై నాలుగు గంటలు జీవించి ఉంటాయట. కాటన్‌ వస్త్రాలపై 12 గంటలు, అట్ట ముక్కలు అట్ట డబ్బలపై 24 గంటలు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపకరణాలపై 2 నుంచి 3 రోజులు కరోనా వైరస్‌ జీవించి ఉంటుందట. ఇక గాజు పాత్రలు, ప్లాస్టిక్‌ వస్తువులపై కూడా కరోనా వైరస్‌ కణాలు మూడు రోజులు జీవించి ఉంటాయట. ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌ బారినపడకుండా ఉండాలంటే మనమంతా స్వీయ శుభ్రత పాటిద్దాం.. కరోనా మహమ్మారిని కట్టడి చేద్దాం.