క‌రోనా వైర‌స్‌.. న్యూస్ పేప‌ర్ల యాజ‌మాన్యాల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వా..?

-

ఎక్క‌డో చైనాలోని వూహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ మ‌న దాకా వ‌స్తుందా..? అని అప్ప‌ట్లో చాలా మంది అనుకున్నారు. కానీ అది దేశాలు, న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు దాటి.. మ‌న గ్రామాల దాకా వ‌చ్చేసింది. దీంతో దేశం మొత్తం దాదాపుగా లాక్ డౌన్ అయింది. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఓ వైపు జ‌నాలు త‌మ ఆరోగ్యం గురించి ఆందోళ‌న చెందుతుంటే.. మ‌రోవైపు ప్ర‌తి ఒక్క‌రికీ ఏదో ఒక ర‌కంగా క‌రోనా కొత్త కష్టాల‌ను తెచ్చి పెడుతోంది. లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ నెల త‌మ‌కు పూర్తి జీతం వ‌స్తుందా.. అని వేత‌న జీవులు కంగారు ప‌డుతుంటే.. రోజువారీ కూలీలు పూట గ‌డిచేదెట్లా అని క‌ల‌త చెందుతున్నారు. ఇక క‌రోనా ప్ర‌భావం ప్ర‌స్తుతం అన్ని రంగాల‌పై ప‌డింది. ఏదో ఒక ర‌కంగా ఆ వైర‌స్ వ‌ల్ల దాదాపుగా ప్ర‌తి ఒక్క రంగం తీవ్ర‌మైన న‌ష్టాల్లో న‌డుస్తోంది.

corona virus may affect news paper companies

ఇక మీడియా రంగంపై క‌రోనా ప్ర‌భావం ఇప్పుడంత క‌నిపించ‌క‌పోయినా.. భ‌విష్య‌త్తులో క‌రోనా ఎఫెక్ట్ ఆ రంగంపై చాలా ఎక్కువ‌గానే ప‌డే అవ‌కావం ఉంద‌ని తెలుస్తోంది. అందులోనూ ముఖ్యంగా ప్రింట్ మీడియాపై క‌రోనా ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే.. క‌రోనా వైర‌స్ ఆ రంగం వ‌ల్ల ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుంద‌ని భావిస్తున్నారు. ఎలాగంటే.. మ‌న‌కు నిత్యం వ‌చ్చే దిన‌ప‌త్రిక ఎక్క‌డో త‌యార‌వుతుంది.. మ‌రెక్క‌డో ప్రింట్ అవుతుంది.. దాన్ని ఎంద‌రో తీసుకువ‌చ్చి మ‌న ఇంటి ద‌గ్గ‌రకు తెచ్చి వేసి వెళ్తారు. ఆ స‌మ‌యంలో ఎంతో మంది దాన్ని ముట్టుకుంటారు. అందువ‌ల్ల క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశాలను అంతగా కొట్టి పారేయ‌లేమ‌ని భావిస్తున్నారు.

దిన‌ప‌త్రిక ప్రింట్ అయ్యాక ప్రింట్ ఆఫీస్ నుంచి బండిల్స్‌గా మారి బ‌య‌ట‌కు వ‌స్తుంది. త‌రువాత వాటిని హోల్ సేల్ పాయింట్ల‌కు పంపిస్తారు. అక్క‌డి నుంచి స్థానిక పాయింట్ల‌కు న్యూస్ పేప‌ర్ బండిల్స్ వ‌స్తాయి. వాటిని వేరు చేసి ఇళ్ల‌కు, షాపుల‌కు, ఇత‌ర కార్యాల‌యాల‌కు పంపిస్తారు. ఈ క్ర‌మంలో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అపార్ట్‌మెంట్ల‌లో అయితే పేప‌ర్ వేసే వారు కింద వాచ్‌మెన్‌కు ఇస్తారు. అక్క‌డి నుంచి అవి వాచ్‌మెన్ల ద్వారా ఇళ్ల‌కు చేరుతాయి. ఈ క్ర‌మంలో ఒక దిన‌ప‌త్రిక ప్రింట్ అయి పాఠ‌కుడికి చేరే స‌రికి అంతిమంగా ఎన్నో ద‌శ‌ల్లో అది ఎంద‌రో చేతులు మారుతుంది. దీంతో ఎంతో మంది దాన్ని ట‌చ్ చేస్తారు. ఈ క్ర‌మంలో ఆ ట‌చ్ ద్వారా కరోనా వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంటుందా..? అనే పోస్టులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ విష‌యాన్ని తీసిపారేయ‌లేం. ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేసినా వైర‌స్ మ‌న ఇంటి గ‌డ‌ప దాకా వ‌స్తుంది. ఆ తరువాత ఎంత‌టి ఉప‌ద్ర‌వాలు సంభ‌విస్తాయో అంద‌రికీ తెలుసు.

అయితే ఈ విష‌యాన్ని జ‌నాలు గ‌న‌క మ‌రింత సీరియ‌స్‌గా తీసుకుంటే మాత్రం ప్రింట్ మీడియాకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే కేవ‌లం ఆన్‌లైన్ లేదా టీవీలోనే జ‌నాలు వార్త‌లు చూస్తారు. చ‌దివి తెలుసుకుంటారు. దిన‌ప‌త్రిక‌ల జోలికి వెళ్ల‌రు. ఈ క్ర‌మంలో న్యూస్ పేప‌ర్ల యజ‌మాన్యాల‌కు తీవ్ర‌మైన న‌ష్టాలు వ‌స్తాయి. అస‌లే చాలా ప‌త్రికలు ఇప్పుడు న‌ష్టాల్లో న‌డుస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఈ విష‌యం వారిని ఇంకా క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ముందు ముందు ఏమ‌వుతుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news